కథ

సరదాల సంక్రాంతి

రచయిత శర్మ జి యస్
బొమ్మలు రామకృష్ణ


          ఇంగ్లీష్ పేపర్ చూస్తే ఇండియా చుట్టొచ్చినంత ఆనందపడిపోతాడు పరంధామయ్య .
              సోఫాలో కూర్చొని ఆ ఇంగ్లీష్ పేపరే చదువుకుంటున్నాడు పట్టు వదలని విక్రమార్కుడిలా , చెట్టు వదలని భేతాళునిలా . సూట్ కేసుతో  లోపలకి వస్తున్న  పెద్దల్లుడు పెఱుమాళ్ళు రాకని పరంధామయ్య గమనించనే లేదు .
అదే సమయంలో వంటింటిలోంచి  వస్తున్న కామాక్షమ్మ పెఱుమాళ్ళు  రాకను గమనించి , " రండి అల్లుడు గారూ , రండి " అంటూ ఆహ్వానించింది  .
              "  ఇంతదూరం వచ్చినవాణ్ణి ఇంట్లోకి రాకుండా పోతానటండి అత్తయ్యగారూ  " బదులిచ్చాడు  .
              "  ఇపుడేనా రావటం ?  "  మాములుగా ప్రశ్నించింది కామాక్షమ్మ  .
              "  అహ, లేదండి  . ఉదయమనగా వచ్చి  , ఊరంతా ఊరకే తిరిగి తిరిగి , ఇపుడే మన యిల్లు  గుర్తుకొస్తే  ,  వస్తున్నా "  బదులిచ్చాడు పెఱుమాళ్ళు  .
             "   అబ్బే , అలా అనలేదండి అల్లుడుగారూ   "  .
             "   కాకపోతే , ఏమిటండి  ,  ఓ పక్క చేతిలోని సూట్ కేసుని , మరో పక్క , ప్రయాణంలో నలిగిన బట్టలతో నన్ను చూస్తూనే ఇలా అడుగుతున్నారంటే మఱేమనుకోవాలి ?  "
             "   ప్రయాణం సుఖంగా జరిగిందా ?  "
             "   ఏమిటండీ ఈ చొప్పదంటు ప్రశ్నలు ?  "
              "   కుశల ప్రశ్నలు వేయటం తప్పాండి అల్లుడుగారు. "
              "   కాకపోతే ఏమిటండి  ,  ప్రయాణం సుఖంగా జరగకపోతే  , జరిగిన ప్రయాణంలో సుఖాన్నేమైనా కలిగిస్తారా ?   దుఃఖాన్నేమైనా తొలగిస్తారా ? " ఎదురు ప్రశ్న వేశాడు  .
              "   మండుటెండలో  ప్రయాణం చేయలేదు కదా ?  "
              "   ఎండాకాలంలా ఉన్న ఈ శీతాకాలంలో ఉదయమనగా బయలుదేరి  ,  ఇప్పటికి అంటే ఈవెనింగ్  ఈ సమయానికొచ్చానంటే , మండుటెండలో కాక  ,  మంచుకొండల్లో ప్రయాణించినట్ల వుతాందాండి . "
              ఇంక తను మాట్లాడటం మంచిది కాదని  ,  ఆయనగారికి అప్పచెప్తే మంచిదని భావించిన కామాక్షమ్మ , పరంధామయ్యనుద్దేశించి  , "  ఏమండోయ్, మిమ్మల్నేనండి , ఓ మారు తల పైకెత్తండి " .
              పరంధామయ్య లో ఏ మార్పు లేదు .
              ఇది గమనించిన పెఱుమాళ్ళు  "  అదేమిటండి అత్తగారూ  ,  అంత తల పైకెత్తలేనంత తలవంపుల పని ఏం చేశారు మామయ్యగారు  ?  అందునా ఈ  వయసులో " చమత్కరించాడు  .             

"  చేయదగిన వయసులోనే ఏమీ చేయలేదు, ఇంక ఈ వయసులో ఏం చేస్తారు ? అదిగో ఆ ఇంగ్లీష్ పేపర్ ముందేసుకున్నారంటే , మందేసుకున్న వానిలా మనలోకంలోనే ఉండరు ."
               "  అలాగాండి !  " ఆశ్ఛర్యంగా అడిగాడు పెఱుమాళ్ళు  .
                "  అవునండీ అల్లుడుగారు , బంగారం లాంటి ఫ్రిజ్ ని కూడా పోగొట్టుకున్నాం . ఇలాగే ఆ రోజూ ఈ ఇంగ్లీష్ పేపర్ ముందేసుకు కూర్చొన్నారు  .  చిన్నవాడు  పవన్ బడికెళ్ళిపోయాడు . నేను వంటింట్లో వంటపనుల్లో మునిగిపోయాను  . ఎవరో వచ్చి ఫ్రిజ్ మా షో రూం కి తీసుకువెళ్ళి రిపేర్ చేసి  తీసుకు వస్తామని కటింగ్ ప్లయ్యర్  ,  స్కౄ డ్రైవర్ చూపించి , తీసుకువెళ్తుంటే సరే అని  , ఆయన ధ్యాసలో ఆయన ఉన్నారు . తీరా నాకు వెన్న కావలసి ఫ్రిజ్ దగ్గరకు వస్తే ఫ్రిజ్ చోట ఖాళీ కనపడింది  .  ఆయన వద్దకు వెళ్ళి “ ఫ్రిజ్ ఏదండీ "  అని అడిగాను .  "
                " వాళ్ళు వచ్చి రిపేర్ చేసి తీసుకువస్తామని షో రూం కి తీసుకువెళ్ళారే  ." అన్నారు .
                "  ఏ షో రూం అండి ? "
                "  నే అడగలేదు , వాళ్ళూ చెప్పనూ లేదు " అన్నారు .               
                "  ఇదే వరస అల్లుడుగారు , నఱకయాతన పడ్తున్నామనుకో . "
                "   అయ్యో! అలాగాండి  , పాపం "  అని జాలిపడ్డాడు పెఱుమాళ్ళు  .

                పరంధామయ్య భుజం మీద చేయి వేసి తడుతూ , "  ఇదిగో మిమ్మల్నే , ఎవరొచ్చారో చూడండి " అన్నది కామాక్షమ్మ . తల పైకెత్తకుండానే , "   సంక్రాంతికి కూడా ఇంకా ఈ మామూళ్ళ బెడద వదలటం లేదన్న మాట . నువ్వే  ఆ మొఖాన్ని  చూసి  ఓ పాతికో , యాభయ్యో ఇచ్చి పంపు  "  అన్నాడు పరంధామయ్య  .
                పెఱుమాళ్ళు ఖంగు తిన్నాడు  .
                కామాక్షమ్మ అల్లుడుగారికి ఎక్కడ కోపం వస్తుందోనని కలత చెందినదై  "  ఓ మాఱు ముఖం చూసి మాట్లాడండి  "  అన్నది  .
                తల పైకెత్తకుండానే  , “ ఈ మామూళ్ళకి ఓ సమయమంటూ లేకుండా పోయింది రాను రాను . ఏమిటిలా ఎప్పుడు పడితే అప్పుడు మామూళ్ళడుగుతారేంటి అని అడిగితే చాలు , చాలా తేలికగా చెప్పేస్తున్నారిలా ‘ వాటి పేరే మామూళ్ళు ' కదండీ అని , మఱి అడిగే పనే లేదండి అంటున్నారు .  ఇంక నేను చూడటం దేనికే , నువ్వే చూసి ఎంతో కొంత యిచ్చి పంపవే . నేనాడైనా నీ మాట కాదన్నానా ! నీకెదురు చెప్పి నిలిచానా ! నువ్వే చూసి ఏదో ఇచ్చి పంపెయ్  "  బదులిచ్చాడు  .
                కామాక్షమ్మకి ఏం చేయాలో తోచటం లేదు . ఇంటికి పెద్దల్లుడు అని కూడా చూడకుండా ఇంత ఘోరంగా మాట్లాడటం ఎంతగానో బాధ ఓ వైపు , అల్లుడుగారేమనుకుంటారోనని మరోవైపు  మనసులోనే మధనపడ్తూ , అల్లుడుగారి వైపు తిరిగి, " అల్లుడుగారూ  మిమ్మల్ని కాదు లెండి ."
               " సర్లెండి అత్తయ్యగారూ, మీరన్నట్లు నన్ను కాదనుకుంటా . అయితే మఱెవరినంటున్నారు మామయ్యగారు " అడిగాడు పెఱుమాళ్ళు.
             "ఆయన ఎపుడూ అంతే  అల్లుడుగారూ. మీరేమీ వినలేదనుకోండి , ఓ వేళ విన్నా మిమ్మల్ని కాదనుకోండి"  సర్ది చెప్ప ప్రయత్నించింది.
               " విననట్లుండటానికి నాకేమి చెముడు లేదు. పండుగకు రమ్మని ఆహ్వానించి , మంచి మర్యాదే చేస్తున్నారు "
                శృతిమించి రాగం , రోగాన పడబోతుందని గ్రహించినదై , పరంధామయ్య వద్దకు వెళ్ళి భుజం తడ్తూ " ఏమండోయ్ మిమ్మల్నేనండి , ఆ పేపర్లోంచి బైటకు చూడండి " అన్నది కామాక్షమ్మ.
                " ఏమిటే , ఎంత చెప్పినా కాదంటున్నాడా ? సరే ఏం చేస్తాం ? ఓ మాఱు అలవాటు చేసిన తర్వాత యివ్వకుంటే ఊరుకొంటాడా ? సరే యిచ్చెయ్ " పేపర్లో మఱలా లీనమైపోయాడు.
                " అది కాదండీ " భుజం కుదుపుతోంది.
                " నీవేం కంగారుపడకే, ఈ వంద  మఱలా ఎలా మన యినప్పెట్టెకు ఎలా చేరుతుందనేగా నీ బెంగ. అది నా పూచీ. వెళ్ళి త్వరగా యిచ్చి పంపు. ఆలస్యం చేసే కొలదీ , యింకా ఎక్కువ యివ్వమంటాడేమో ? త్వరగా యిచ్చి పంపు " మఱలా పేపర్లో లీనమైపోయాడు.
                 విసుగు చెందిన కామాక్షమ్మ , ఒక్కుదుటున పరంధామయ్య చేతిలోని పేపర్ లాగేసింది. ఎదురుగా కనపడ్తున్న పెఱుమాళ్ళుని చూసి , " ఓహ్ అల్లుడు గారా ! రండి రండి , కూర్చోండి , ఇపుడేనా రావటం ? " అడిగాడు పరంధామయ్య.
                 " మీరు పాతికో , యాభయ్యో యిచ్చి పంపమన్నపుడే వచ్చాను " విసుగ్గా బదులిచ్చాడు
                 " అయితే చాలాసేపయిందన్నమాట.  గమనించలేదు సుమా ! ఈ  మామూళ్ళని ఎవడు కన్నాడో గాని , మనం పెంచలేక చస్తున్నామనుకోండి . రక్కసుల్లా పీక్కుతింటున్నాయనుకోండి. అది సరే గాని మనలో మాట, మొన్న దసరాలు మీకెంత ముట్టజెప్పాయేంటి ? "  అడిగాడు.
                  ఆ మాటలు విన్న కామాక్షమ్మ , పరంధామయ్యను నొక్కుతూ , నోటి మీద వేలు వేసుకుని ' తప్పు , అలా అడగకూడదు ' అన్న భావం వెలిబుచ్చింది .
                 " ఫరవాలేదులేవే  పిచ్చిమొఖమా ! మనం ఎవరికైనా మామూళ్ళు యివ్వవలసివచ్చినపుడు మాత్రమే అవి రక్కసుల్లా , వాటి అక్కసు తీర్చుకుంటాయి మనమీద . మనకు గాని, మనవాళ్ళకు గాని వస్తున్నపుడు ఆ మామూళ్ళే  వరాలిచ్చే దేవతలే . అది అల్లుడుగారికి మాత్రం తెలియదా ఏమిటి ? ఇదేనే అసలు సిసలు ఈ లోకం పోకడ " వివరించాడు .
                  " అలాగాండి "  అపుడే కొత్తగా తెలుసుకున్నదానిలా అన్నది కామాక్షమ్మ అమాయకపు మొఖం పెట్టి .
                   ఇంతలోనే " మాంఛి మజ్జిగనీళ్ళు పట్టుకురా  అల్లుడు గారికి "   ఆర్డరేశాడు.
                  "ఆహాహా ఏమి మర్యాద ? ఏమి మర్యాద ? ఓ వైపు అల్లుడుగారూ అంటూనే , మాంఛి మజ్జిగనీళ్ళు పట్తుకురా అనకపోతే, మాంఛి చిక్కటి మజ్జిగని యిప్పించలేరా ? "  నిర్మొహమాటంగా అడిగేశాడు పెఱుమాళ్ళు .
                  "ఎవరికేమి యివ్వాలో నాకు తెలుసులెండి అల్లుడుగారూ " అంటూ లోపలకు వెళ్ళింది కామాక్షమ్మ.
                  " అల్లుడుగారూ తమరింతకీ ఏ పనిమీద వచ్చారో ? " అడిగాడు పరంధామయ్య.
                  " పనిమీద రావటానికీ , పందుల మీదరావటానికీ మాదేమీ పల్లెటూరు కాదండీ , బస్సు మీదనే వచ్చాను."
                  " ఓ ! బస్సు మీదనా !  అయితే బస్సు మీద ఛార్జీ తక్కువా అల్లుడుగారు."
                  " లేదండీ , రైల్ ఛార్జీలతో పోలిస్తే , బస్సు ఛార్జీలు  ఎల్లప్పుడు ఎక్కువేనండి . "
                   ఇంతలో వంటింట్లోంచి కామాక్షమ్మ జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి పెఱుమాళ్ళు చేతికిచ్చింది .
                   అందుకుని ఓ మారు సిప్ చేసి , " ఛీ... ఛీ... ఏమిటండి యిది జ్యూసా ? ఎలా చేయాలో తెలియకుంటే , మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. అంతే గాని  ఏదో మర్యాదలు చేద్దామనుకొని , అమర్యాదలు చేయటం ఏమీ బాగా లేదండి అత్తగారు . అసలు భార్యలని పుట్టింటికి మాకంటే ముందుగా ఎందుకు పంపుతామో తెలుసా ?  ‘ మా మొగుళ్ళకి ఏమేమి కావాలో , ఎలా కావాలో , అన్నీ చక్కగా అరేంజ్ చేసేటందు కే , ఓ మారు మీ అమ్మాయిని పిలిచి అడగండి."
                   " అదేమిటండి అల్లుడుగారు , అమ్మాయి యింతవఱకు రాలేదుగా ? "  .
                    " మీ అమ్మాయి యింకా రాలేదా ? నిన్న ఉదయం 8 గంటల రైల్లో బయలుదేరిందిగా " ఆశ్ఛర్యంగా పెఱుమాళ్ళు.
                    పేపర్ చదువుతున్న పరంధామయ్య , " నిన్న ఉదయం 8 గంటల రైలుకి యాక్సిడెంట్ అయిందట. 4 బోగీలు నడక తప్పి పడకకు చేరాయట .14 మంది ఆయువు వాయువులో కల్సిపోయాయట " అని తెలియచేశాడు .
                    " అయ్యయ్యో , అమ్మాయి, పిల్లలు అందులోనే వున్నారుటండి , ఎక్కడున్నారో ? ఏమై పోయారో ? " అంటూ ఏడుస్తోంది కామాక్షమ్మ.
                    " ముందా ఏడుపాపవే . ఆ రైల్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకి వస్తుందట . నువ్వు కంగారు పడకు, మమ్మల్ని కంగారు పెట్టకు ." పెఱుమాళ్ళు వైపు తిరిగి " అల్లుడుగారు మీరు స్టేషన్ కి వెళ్ళి అమ్మాయిని , చిరంజీవులను తీసుకురాండి " అన్నాడు పరంధామయ్య .
                    "అలాగేనండి " అంటూ వెంటనే వెలుపలికి వెళ్ళిపోయాడు పెఱుమాళ్ళు .
                    " ఏమేయ్ ఎపుడనగా తిన్నారో , ఏమో , వాళ్ళు ఇపుడొచ్చేస్తారు. త్వరగా ఆ వంటపనేదో చూడు ," మళ్ళీ పేపర్లో నిమగ్నమైనాడు .
                    " అలాగేనండి " వంటగది వైపుగా వెళ్ళింది .
                     అప్పుడే యింట్లోకి వచ్చిన మాధవి పిల్లను తీసుకొని సరాసరి వంట గదిలోకి వెళ్ళిపోయింది , తండ్రి పరంధామయ్యను పలకరించకుండానే .                   
                      పిల్లను  చూసిన కామాక్షమ్మ ,  దగ్గఱకు తీసుకొని  “ ఏమ్మా , ఎవరికీ దెబ్బలేం తగల్లేదుగా " అంటూ తలని , శరీరాన్ని తడుముతున్నది .
                     " లేదమ్మమ్మా , మేమసలు ఆ రైల్లో రాలేదుగా ! , ఆ  తర్వాత   10  గంటల రైల్లో  వచ్చాం . అందువల్లే కొంచెం ఆలస్యమైనా క్షేమంగా యింటికి చేరుకొన్నాం ."
                     " నేను నోచిన నోములు ఫలించాయి. ఆ దేవుడు మనయందున్నాడు. రండమ్మా , త్వరగా స్నానాలు చేసి ఫ్రెష్ అవండి "అనగానే మాధవి పిల్లను తీసుకుని బాత్ రూం వైపుగా వెళ్ళింది.
                      ఇంతలో రెండవ అమ్మాయి రేణుక రావటం చూసిన కామాక్షమ్మ " అమ్మాయ్ , పాపాయేదే ? "
                     " ఆయనగారితో  6 గంటల బండికే వచ్చిందిగా "  రేణుక.
                      " అంటే మా ఊళ్ళో 8 గంటలకి బయలుదేరే రైలు బండేగా ! ? దానికి యాక్సిడెంట్ అయిందిగా పిన్నమ్మా"  అన్నది ప్రణీత.
                      " ఆ ! అదేనే , ఆ రైల్ కి యాక్సిడెంటా ? ఆయన ఎలా ఉన్నారో ?  ఏమో ? " కంగారుపడ్తున్నది రేణుక.
                       అపుడే బాత్ రూం నుంచి వస్తున్న మాధవి , " దేనికే ఆ కంగారు ? మఱది గారు మొగవారేగా ! గాభరా పడకే ?" .
                      " మగవాడనే కదే ఆయన్ను కొనుక్కున్నది . నీకేం సులభంగా కంగారుపడవద్దని చెప్పేస్తావు ? " అన్నది రేణుక అక్క మాధవితో.
                       " అదేమిటే దైవంలాంటి భర్తను అలా కొనుక్కున్నానంటావేమిటే ? " అడిగింది . మాధవి
అర్ధం కాక  .                   
                       " నేను వరకట్నంగా లిస్ట్ ప్రైస్ రేట్  4 లక్షలు యిచ్చి , అదనపు పన్నుల రూపేణా  ఆడపడుచు లాంఛనాల క్రింద 50 వేలు ఇచ్చి , ఎక్సైజ్ డ్యూటీ క్రింద 70 వేలు వెచ్చించి , వెరశి మొత్తం 5 లక్షల 20 వేలు ( అమ్మా నాన్నల ద్వారా ) ధారపోసి ఆయన్ను కొనుక్కున్నానే అక్కా. "
                       " అవునేవ్ నాకూ జ్ఙాపకమొచ్చింది , అపుడు నాన్నగారు షుమారుగా 5 లక్షల పైనే ఖర్చయిందన్నారుగా !  " అన్నది  మాధవి .
                       " అదే అక్కా , మనం ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నపుడు , దాని బాగోగులు చూసుకొంటామా ? లేదా ? ఇదీ అంతేనే "  రేణుక.
                        మాధవి ఆశ్ఛర్యంగా అలాగే రేణుకని చూస్తుండిపోయింది .
                        " అక్కా బాగా ఆలోచించు, మనం కొనుక్కున్న వస్తువు , కనపడకుండా పోతే ఎంతగానో బాధపడ్తాం కదా! కొంతకాలానికైనా ఆ బాధను మఱచిపోయి మళ్ళీ కొనుక్కుంటాం . అది ఓ వేళ బాగా లేకపోయినా , మనకు సంతృప్తికరంగా లేకపోయినా మళ్ళీ మళ్ళీ మార్చుకుంటాం కదా!.
                        " బాగా లేకపోయినా,సంతృప్తికరంగా లేకపోయినా మార్చుకోక తప్పదు కదా మఱి ! " వంత పలికింది మాధవి.


                        " కదా!, మఱి మొగుడనే వాని విషయంలో అలా  మార్చుకోలేం కదా! మనం అమెరికన్లము కాదు కదా ! భారతీయులం , అంతే కాదు అచ్చతెలుగువారం. వస్తువులను కొనుక్కున్నట్లు మొగుణ్ణి కొనుక్కోను లేం . ఈ నిజాన్ని తెలుసుకున్నాను .  కనుకనే ,మార్కెట్లో కొనుక్కున్న అన్ని వస్తువుల కంటే , అమిత జాగ్రత్తగా , అపురూపంగా చూసుకొంటున్నానే ఆయనను" తన తీరుతెన్నులను వ్యక్తం చేసింది రేణుక .
                        ఈ మాటలతో మాధవి నిజాన్ని ఆకళింపు చేసుకున్నదై ," నిజమేనేయ్ , పోతే మళ్ళీ కొనుక్కోవడం కష్టం కూడాను అందులోనూ  నాలాంటి దానికి  కంగారుగా “ ఈయనగారేమైనారో , ఎటు వెళ్ళారో ? ఏమో ?  అమ్మా , వస్తానే “ అంటూ కామాక్షమ్మకు చెప్పి చర చరా బైటకు వెళ్ళిపోయింది .
                        రేణుక కూడా “  అమ్మా నేనూ వెళ్ళొస్తానే,ఓ వేళ ఆయన వస్తే,ఆయనకు సకల మర్యాదలు చేస్తూ ఎటూ వెళ్ళకుండా  జాగ్రత్తగా చూడవేవ్ , మళ్ళీ ఎటైనా వెళ్ళి పోయారనుకో , అటూ , యిటూ అయిపోతాం ఒకరికొకరం కాకుండా "అంటూ వెళ్ళబోతుంటే , కామాక్షమ్మ" అదేమిటే స్నానం కూడా చేయకుండా వెళ్తానంటావ్ , స్నానం చేసి  వెళ్ళవే " .
                       " స్నానమైనా , పానమైనా , మానమైనా ఆయన తర్వాతనే గదే , ఆయన ముందు అవన్నీ బలాదూరేనే "   బైటకు వెళ్ళిపోయింది రేణుక .
                        పరంధామయ్య యింకా యింగ్లీష్ పేపర్ చదువుకొంటూ హాల్లోని సోఫాలోనే కూర్చున్నాడు.
                        ఇంతలో రేవంత్ యింట్లోకి అడుగెడ్తూనే తన నెత్తిమీదనున్న శైలజను క్రిందకు దించి  హమ్మయ్య  అనుకొంటాడు.
                        పరంధామయ్య దృష్టిలో యివేవి పడలేదు .
                        కామాక్షమ్మ వంటిట్లోంచి హాల్లోకి వచ్చి , శైలజను చూసి గబ గబా ఎత్తుకుని " నా చిట్టి తల్లికి దెబ్బలేం తగల్లేదుగా " అంటూ ఆదుర్దాగా ఆ చిన్నపిల్లను తడిమి తడిమి చూస్తున్నది .
                        " నేనెలా కనపడ్తున్నానండీ అత్తయ్యగారు " అన్నాడు కోపంగా రేవంత్ .
                        " కోపగించుకోకండి అల్లుడుగారు. మీ రైల్ పట్టాలు తప్పిందటగా ? " అందుకని .
                        " చూడండి అత్తయ్యగారూ ఈ రోజుల్లో నాయకులు మాటలు తప్పటం , ఆడపిల్లలు నెల తప్పటం, రైళ్ళు పట్టాలు తప్పటం  సర్వసాధారణ విషయమేనండి . కాకుంటే ఒక్కటే , చిన్న పిల్లలని తీసుకుని ఒంటరిగా అంటే ఆడవాళ్లు పక్కన లేకుండా మగవాడనేవాడెవడూ ఎన్నడూ ప్రయాణం చేయకూడదని బాగా తెలుసుకున్నానండి ."
                        " ఏమైంది అల్లుడుగారు ? "
                        " ఇంతకన్న యింకేం కావాలండి ? అయింది చాలు. యాక్సిడెంట్ అయి రైల్ యింజన్ ఆగిపోయింది . మేమూ అక్కడే ఆగిపోయాం . శైలూ యింజన్ స్టార్ట్  అయింది . అప్పటికీ తను అడిగినవన్నీ కొనిపెడ్తూనే వున్నా .  అన్నీ కొనిపెట్టింతర్వాత , తినకుండా అవతల పారేసి , మఱల మరొకటి కొనిపెట్టమని గొడవ చేస్తుంటే , కొనిపెట్టనని  కోపగించేసరికి , ఆరున్నొక్క రాగం అందుకుంది. ఇంక సప్తస్వరాలతో తారాస్ధాయికి చేర్చింది ఆ ఆరున్నొక్క
రాగాన్ని ".
                        " అయ్యో పాపం పసిపిల్ల ఏడ్చిందా ? " .
                        " తను ఏడిస్తే ఫరవాలేదండి , నన్ను ఏడ్పించింది కదండీ . కంపార్ట్మెంటు లో వాళ్ళందరూ , మా యిద్దర్ని మాటి మాటికి చూస్తూ, చివరికి ఉండబట్టలేక, ఓ స్ధిర నిర్ణయానికి వచ్చినవాళ్ళై , బాబూ తల్లి లేని పిల్లను అలా ఏడ్పించకు , ఆడిగినది కొనిపెట్టు, కాకుంటే ఈ పది ఉంచుకో అంటూ అంతా నా చేతిలో ఎవరి మనసుకి తగ్గట్లు వాళ్ళు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు .                       
                         " ఏ మాత్రం తెలుసుకొకుండానే అంత పని చేశారా ? "
                         " అది కాదండి , పాపకి ఐస్ క్రీం కొనిపెట్టి చూస్తుండమని చెప్పి , సూట్ కేసు మీద కూర్చో పెట్టి ( ఆఫీసు పని వత్తిడిలో , నిద్రలేమితో ) నిద్రపోయా. తీరా మెలకువ వచ్చి చూస్తినిగదా , శైలు స్టైలుగా ఐస్ క్రీం యింకా  తింటూనే ఉన్నది."
                          " చూశారా అల్లుడుగారు మా శైలు ఎంత జాగ్రత్తపరురాలో ".
                          " అది జాగ్రత్త కాదండి అత్తయ్యగారూ ,  అజాగ్రత్త . అనుమానంతో రిష్ట్ వాచ్ చూసేసరికి 4 గంటలయింది . ఎపుడో 2 గంటలకి యిప్పించిన ఐస్ క్రీం యింకా తింటూ వుంటే ఆశ్ఛర్యపోయాను . ఇంకా అయిపోలేదా అంటే , అదెపుడో అయిపోయింది , యిది యింకో ఐస్ క్రీం . ఆ సూట్ కేస్ అంకుల్ యిప్పించా రన్నది . సూట్ కేస్ ఏదంటే , ఐస్ క్రీం అంకుల్ తీసుకెళ్తూ, నన్ను క్రింద కూర్చోపెట్టకుండా , మరో సూట్ కేస్ మీద కూర్చోపెట్టి వెళ్ళాడుగా . ఆ సూట్ కేస్ అంకుల్ చాలా మంచి అంకుల్ . నాకు నిద్ర వస్తున్నా , ఆపుకొని చూస్తూ కూర్చొన్నానని చెప్పింది. "
                          " అయ్యో పాపం అలా జరిగిందాండి . చిన్న పిల్ల కదా! దానికివేమి తెలియవు కదండి , ఏమనుకోకండేం  ."
" అసలు విషయం యింకా మీరు విననే లేదు . నా రైల్ టికెట్లు , క్రెడిట్ & డెబిట్ కార్డులు , విజిటింగ్ కార్డులు , డబ్బులు , బట్టలు అన్నీ ఆ సూట్ కేస్ లోనే వుండిపోయాయి . నా పరిస్ధితి వర్ణనాతీతం
అత్తయ్యగారు " బాధపడ్డాడు .
                          " అలా బాధపడకండి అల్లుడుగారు , అన్ని వేళలు మనవి కావు ."
                          " నిజమేనండి అత్తయ్యగారు  . నేను రావటానికి చార్జీలు లేక , కట్టుబట్టలు తప్ప , మఱో బట్టలేక , ఆ ఆగిపోయిన రైల్ మఱలా బయలుదేరే వఱకు అక్కడే పిచ్చి చూపులు చూస్తూ , అది బయలుదేరగానే ఎక్కి కూర్చొన్నా . ఇంతలో రైలు కొంతదూరం వెళ్ళగానే టీ సి వచ్చి , టికెట్ అడిగాడు . జరిగింది చెప్పా , చెవులతో విన్నాడే గాని , ఫైన్  కట్టమన్నాడు . అప్పుడు ఆ ఆ కంపార్ట్మెంటులో వాళ్ళు నా చేతిలో వుంచిన డబ్బులు ఆయనకు సమర్పించి , నన్ను వదిలేయమన్నా . ఆయన అడిగినంత యివ్వలేదని , ఆ డబ్బులు తీసుకొని , రసీదు యివ్వకుండ వెళ్ళిపోయాడు  .అందులోనే యిక్కడకు వచ్చి , తిన్నగా ఔటర్ సిగ్నల్స్ వరకు నడచి , అక్కడనుంచి శైలుని స్టైలుగా నెత్తిమీద ఎక్కించుకొని నేరుగా ఇంటికి చేరుకొన్నా."
                          " అయ్యో అన్ని అవస్ధలు పడ్డారా అల్లుడుగారు . లోపలకి వెళ్ళి వేడినీళ్ళతో స్నానం చేసి రండి, వెతలన్నీ మఱచి హాయిగా నిద్రపోదురు గాని ."
                          " అమ్మో మళ్ళీ నిద్రే , నేను పోను గాక పోను. నా రేణుకేది ? "  అడిగాడు రేవంత్.
                          " మీ కొఱకే వెతుక్కుంటూ వెళ్ళింది అల్లుడుగారు . మీరెక్కడకు వెళ్ళకండి . నిద్ర పోక పోతే పోకపోయారు . మీరు స్నానం చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి . అమ్మాయి యిపుడే వచ్చేస్తా నన్నది ."
                          " అలాగే " స్నానానికి బాత్ రూం వైపుగా నడిచాడు రేవంత్ .
                          పరంధామయ్య పేపర్ మడత పెట్టి , టేబుల్ మీద ఉంచి , తల పైకెత్తగానే, పెఱుమాళ్ళు , మాధవి , రేణుక హాల్లోకి అడుగుపెట్టారు . ఆ సమయంలోనే స్నానం  ముగించుకు వచ్చిన రేవంత్ ని చూసి, " మీరంతా ఎపుడొచ్చారోయ్ " అన్నాడు .
                          " ఎపుడో వచ్చారులెండి ఎన్నో అవస్ధలు పడి " అన్నది కామాక్షమ్మ .
                          " మమ్మల్నందరిని సంక్రాంతి పండుగకు పిలిచి యిబ్బంది పెట్టేశారుగా మామయ్యగారు "  " అన్నాడు పెఱుమాళ్ళు .
                           " ఇబ్బంది పెట్టాలని ఈ సిబ్బందిని పిలవలేదు . అందఱం కలసి ఆనదంగా గడుపుదా మని పిలిచా . మేమిద్దఱం ఎంత మందింటికి వెళ్ళగలం . మేమూ మనుషులమేగా , దేవుళ్ళం కాదుగా. అందుకే మీ అందఱినీ మా ఇంటికి ఆహ్వానించానంతే . అనుకోకుండా ఎదురయిన యిబ్బందుల్ని మఱచి పోయి హాయిగా, అందఱం ఆనందంగా ఈ సంక్రాంతి పండుగ సరదాగా జరుపుకొందాం  పదండర్రా అంటూ లేచాడా ఇంగ్లీషు పేపర్ వదలిపెట్టి ."


                                                 ****    


2 comments: