రాంబాబు పధ్ధతైన
మనిషి
రచన - జి యస్ లక్ష్మి బొమ్మలు - రామకృష్ణ
అడుగు తీసి అడుగు వెయ్యడానికి
కూడా పదిసార్లు ఆలోచించే అతను ఏరోజు చెయ్యవలసిన పనులన్నీ ఆ రోజుకు ముందురోజే
మర్చిపోకుండా రాసిపెట్టేసుకుంటాడు. అలాగే ఆరోజు కూడా కాఫీ తాగి చెయ్యవలసిన పనులు రాసిపెట్టుకున్న కాగితం చూసుకున్నాడు. పొద్దున్నే ఎనిమిది
గంటలకి బెజవాడలో వుంటున్న అక్కయ్యకి ఫోన్ చెయ్యాలని రాసి వుందందులో. అక్కపిల్లలిద్దరూ
అమెరికాలో సెటిల్ అయిపోడంతో వాళ్ళిద్దరూ ఒంటరిగా ఫీలవకుండా ఈ పండక్కి అక్కా,
బావగారినీ పిలిచి, ఓ నాలుగురోజులైనా వారికి కాలక్షేపం చెయ్యాలని
అప్పటికి ఇరవై రోజుల్నించి అనుకుంటున్నాడు. టైమ్ చూసాడు. ఎనిమిదీ పదైంది.
ఇంకిప్పుడు లాభంలేదు. అక్క రోజూ పొద్దున్నే ఎనిమిదికల్లా గుడికి వెడుతుంది. మళ్ళీ
పది దాటితే కాని ఇంటికి రాదు. అప్పటికి
తను ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. రేపు లేవగానే చెయ్యాలి అనుకుంటూ దాని ఎదురుగా మర్నాటి
తేదీ వేసుకున్నాడు పెద్దగా కనపడేలా.
కాగితంలో తర్వాత చెయ్యవలసిన
పనేముందా అని చూసాడు. తొమ్మిది గంటలకి బేంక్ కి వెళ్ళాలి అనుంది. అవును కదూ.రాసి
పెట్టుకుని ఎంత మంచిపని చేసేడు తను.అప్పుడే చాలారోజులయింది పాస్ బుక్ అప్డేట్
చేయించి ఏకంగా ఒకేసారి ఈ నెలకి కావలసిన డబ్బు కూడా విత్ డ్రా చేసుకోవచ్చుఅనుకుని
లేవబోతూ ఆ రోజు డేట్ చూసాడు. ఇంకా రెండు రోజులుంటే వున్న డబ్బుకి ఇంటరెస్ట్ కూడా
కలిపి వేస్తారు.అప్పుడు వెడితే రెండు పనులూ ఒకేసారి అయిపోతాయి అనుకుంటూ ఆ పని
యెదుట రెండురోజుల తర్వాతి తేదీ వేసుకున్నాడు.
సాయంత్రం అయిదవగానే ఇంటికి బయల్దేరుతూ
ఇంటికెడుతూ చెయ్యవలసిన పనులేమిటా అని కాగితం చూసుకున్నాడు. కూతురు సుమకి
పెళ్ళిసంబంధం చెప్పిన రంగనాథంఇంటికి వెళ్ళి ఆ సంబంధం గురించి పూర్తి వివరాలు
తెలుసుకోవాలి. బయల్దేరబోతూ ఆగిపోయేడు.
ఇప్పుడు తను సోమాజిగూడా నుంచి
యూసుఫ్ గూడాలో వుంటున్నవాడింటికి వెళ్ళి, వివరాలు కనుక్కుని మళ్ళీ ఇంటికి తార్నాకా దాకా వెళ్ళేసరికి ఈ ట్రాఫిక్
జామ్ లతో ఎంత ఆలస్యమవుతుందో.. అసలిప్పుడు తను వెళ్ళినా రంగనాథం ఇంట్లో
వుంటాడోవుండడో.అంతకన్న రేపు పొద్దున్నే ఓసారి ఫోన్ చేసి, వుంటాడని నిర్ధారించుకుని, ఆఫీస్ నుంచి ఓ గంట ముందుగా బయల్దేరితే పధ్ధతిగా
వుంటుందనుకుని కాగితం మీద పొద్దున్నే ఫోన్ చెయ్యాలని వెంటనే రాసేసుకున్నాడు.
కాగితంలో తర్వాతేముందా అని
చూస్తే దారిలో వున్న పచారీకొట్టు నుంచి కొన్ని సామాన్లు తెమ్మని జాబితా ఇచ్చింది
సుమిత్ర. ఆ జాబితాలో ఏమున్నాయా అని చూస్తే కందిపప్పు, చింతపండు, ధనియాలు అని రాసివున్నాయి. విసుగొచ్చిందతనికి. అయినా ఈ సుమిత్రక్కూడా ఓ
పధ్ధతీ పాడూ అంటూ లేదు. నెలక్కావలసిన సరుకులన్నీ ఒక్కసారి తెచ్చుకుంటుంది కదా.
మధ్యలో ఇలా అవగొట్టడవేవిటి! నెలమొత్తానికని తెచ్చిన సరుకులు నెలంతా వాడుకోవాలని తెలియొద్దూ.
ఇంకా నాలుగురోజులక్కాని సరుకులు తెచ్చినెలా అవదు. ఈ నాలుగురోజులూ పప్పు లేకుండా
తింటే సరి..కొంపలేం కూలిపోవు అనుకుంటూ కాగితం లోంచి ఆ జాబితాని కొట్టేసేడు
రాంబాబు.మరింక దారిలో కూరలు తీసుకుని వెడదామంటూ ఆఫీసు నుంచి బయటకొచ్చిన రాంబాబుకి ఆకాశం మేఘావృతమై కనిపించింది.ఇప్పుడు మధ్యలో
కూరలకోసం ఆగితే వర్షంలో చిక్కుకుపోతే యెంత కష్టం.యేవైనా సరే.వర్షం పడేలోపల ఇంటికి
వెళ్ళిపోవాలి. కూర లేకపోతే రేపు పచ్చడి వేసుకు తినొచ్చు అనుకుంటూ ఆఫీస్ నుంచి
ఇంటికి చేరుకున్న రాంబాబుఇంటికి రాగానే ముందరిగదిలో కూర్చుని టీవీ చూస్తున్న అక్కా,
బావగార్లని చూసి
"మీరెప్పుడొచ్చేరూ?" అంటూ
ఆశ్చర్యం ప్రకటించేడు.
"అదేవిట్రా అలాగంటావ్? నువ్వేకదా పండక్కి రమ్మనమని టిక్కెట్లు కూడా పంపించేవ్." అంతకన్న
ఆశ్చర్యపోయింది రాంబాబు అక్కయ్య.
"నేనా!" అంటున్న రాంబాబుని చూస్తూ, "నీ సంగతెవరికి తెలీదోయ్.నువ్వు రాతలవాడివేగాని
చేతలవాడివికాదని మాకు తెలుసుగా."అన్నారు నవ్వుతూ రాంబాబు బావగారు.వంటగదిలోంచి
కాఫీకప్పులతో వచ్చిన సుమిత్ర నవ్వుతూ కాఫీ అందించింది. రాంబాబు ఖంగారుపడిపోతూ,
"సుమిత్రా, నేనింకా ఈ నెల డబ్బు డ్రా చెయ్యలేదు. మరి
ఖర్చులకి."అంటుండగానే."మరేం ఫరవాలేదండీ. ఇంటి ఖర్చులకిచ్చింది ఇంకా
కాస్తుందిలెండి.“ అందినవ్వుతూ.
రాంబాబు బావగారు మటుకు ఊరుకోకుండా"రాంబాబూ, నువ్వు నీ పధ్ధతి మార్చుకోవాలోయ్"అన్నారు.
"ఏంటండీ.అదీ."
"అదే,నువ్వు చెయ్యవలసిన పనుల లిస్ట్ రాసుకోడం మానెయ్యంతే."
అందరికీ ఆగమన్నా ఆగకుండా నవ్వొచ్చేసింది.
*****
ఈ సంచికలోని ఇతర రచనలు
No comments:
Post a Comment